ప్రాణం తీసిన వేగం
ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న టాటా మేజిక్ వాహనం
ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
లారీని తప్పించబోయి రాంగ్‌రూట్‌లోకి వెళ్లిన వ్యాన్
పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా ప్రమాదం
యలమంచిలి రూరల్:
మితిమీరిన వేగం, ఆపై లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో రాంగ్‌రూట్‌లోకి వచ్చిన మినీ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10.20 గంటలకు చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆనందంగా వెళ్తున్న ఓ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గాజువాకలోని శ్రీహరిపురానికి చెందిన 8 మంది (ఏపీ 39 జీఎక్స్ 3891) మినీ వ్యాన్(టాటా మేజిక్)లో కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో మినీవ్యాన్‌ను ఎడమ పక్కగా రాంగ్‌రూట్‌లోకి డ్రైవర్ నడిపాడు. దాంతో అక్కడే రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడం, ఆటో, మినీ వ్యాన్‌లో ప్రయాణికులు కేకలు వేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.
మినీ వ్యాన్ ముందుభాగం నుజ్జయింది. ఆటో రోడ్డు పక్కగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్‌తో పక్కకు తొలగించారు.
మితిమీరిన వేగం వల్లే ప్రమాదంగా నిర్ధారణ
ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి సీఐ ధనుంజయరావు, యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన హైవే అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు. యలమంచిలి సీహెచ్‌సీ వైద్యాధికారి నిహారిక, వైద్య సిబ్బంది క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని అంబులెన్సుల్లో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. మినీ వ్యాన్(టాటా మేజిక్) డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన గొంది పెంటయ్య, బాదంపూడి లక్ష్మి
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
ప్రమాద సమయంలో ఆటోలో పది మంది, మినీ వ్యాన్‌లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆటోలో ఉన్న కశింకోట మండలం తీడ గ్రాామానికి చెందిన గొంది పెంటయ్య(56), నర్సీపట్నంలో ధర్మిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65) చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు.
ప్రాణం తీసిన వేగం


