పీజీఆర్‌ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం తగదు
తుమ్మపాల: కలెక్టర్‌కు తమ సమస్య వివరిస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో పీజీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రతి అర్జీదారుని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక( పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఆమెతో పాటు, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ఇన్‌చార్జి డీఆర్వో ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని అర్జీలపై స్పష్టత ఇవ్వడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని చెప్పారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్జీల స్థితిగతులను తెలుసుకోడానికి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చిని చెప్పారు. మొత్తం 292 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సందీప్, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామరావు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి హైమవతి, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సాగు భూమిని ఆక్రమించుకున్నారు
పూర్వీకుల నుంచి జీడి తోట సాగుచేసుకుంటూ వచ్చే ఆదాయంతో జీవిస్తున్న తమ నుంచి ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని. తమకు న్యాయం చేయాలని కోరుతూ అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పొట్నూరి భాస్కరరావు, కనకమ్మ, కొడమంచిలి చిన్నారావు పీఆర్‌ఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. కోడూరులో సర్వే నంబర్ 45 గల సుమారు 5 ఎకరాల ప్రభుత్వం భూమిలో మా పూర్వీకుల నుంచి జీడి తోటను సాగు చేయడంతో పాటు చాకలి దొడ్డి నిర్వహిస్తూ గ్రామస్తుల దుస్తులను ఉతికేవారమని పేర్కొన్నాడు. జీడి తోటలో ఖాళీగా ఉన్న యూకలిప్టస్ తోట వేసేందుకు తోటల వ్యాపారం చేసే పెల వరహాలు, బాబులకు భాగానికి ఇచ్చామని తెలిపాడు. ఆ భూమిని వారు ఆక్రమించుకున్నారని, దివ్యాంగుడినైన తనకు న్యాయం చేయాలని కోరాడు. ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి దొంగ పత్రాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నాడు.
అక్రమ నిర్మాణాలను తొలగించాలి
ఎన్‌హెచ్–16కి ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, రోడ్డు ప్రమాదాలతో పాటు, ప్రభుత్వ భూమి ఆక్రమణలను నిలువరించాలని అనకాపల్లికి చెందిన కాండ్రేగుల నాగేంద్రబాబు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి –ఆనందపురం జాతీయ రహదారి విస్తరణలో కాపుశెట్టివానిపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 10లో గల ప్రభుత్వ భూమిలో గల గృహాలకు నష్టపరిహారం పొందినప్పటికీ లబ్ధిదారులు మళ్లీ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డుకు అనుకుని నిర్మాణాలు చేపడుతూ క్రయవిక్రయాలు చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకుండా ఆక్రమణదారులకు ఇంటిపన్ను, విద్యుత్ కనెక్షన్‌లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రహదారి నిర్వాహణ సంస్ధ (డీబీఎల్) సిబ్బంది ఆక్రమణదారుల నుంచి నెలవారీ మామ్మూళ్లు వసూలు చేస్తూ ఆక్రమణలకు ప్రోత్సహిస్తున్నారని, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం తగదు


