పోలేపల్లిలో భూ ఆక్రమణల తొలగింపు
బుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లి గ్రామంలో భూ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పోలేపల్లిలో కూటమి నేతల భూ ఆక్రమణపై గత నెల 27న సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించి చర్యలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 156లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బుచ్చెయ్యపేటకు కిలోమీటరున్నర దూరంలో ఈ భూములుండటంతో వీటి ధరలు ఆకాన్నంటుతున్నాయి. ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది కూటమి నేతలు కళ్లు ఈ భూములపై పడ్డాయి. జేసీబీలతో తుప్పలు, డొంకలను తీయించి 30 ఎకరాలు ఆక్రమించారు. రూ.ఐదు కోట్లు విలువ గల భూమిని ఆక్రమించి యూకలిప్టస్ మొక్కలను నాటారు. ఇందులో ఐదెకరాల వరకు చైన్నెకు చెందిన వ్యక్తికి అమ్మకాలు చేపట్టి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. మరికొంత భూమిని అమ్మకాలకు పెట్టారు. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో కూటమి నేతలు గ్రామ సర్పంచ్ సీతా బుజ్జి, మరికొంత మంది ఇళ్లపైకి వెళ్లి దూషించారు. దాంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి గత నెల 29న బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ గ్రామంలో భూ ఆక్రమణలు తొలగించాలని నినాదాలు చేశారు. తుఫాన్ ప్రభావంతో సిబ్బంది అందుబాటులో లేరని, వారం రోజుల్లో భూ ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్ లక్ష్మి హామీ ఇచ్చారు. సోమవారం అన్ని గ్రామాల వీఆర్‌ఏలు, వీఆర్వోలు, ఆర్‌ఐ, పోలీసులతో వెళ్లి భూ ఆక్రమణలో నాటిన మొక్కలను తొలగించారు. ఆక్రమణ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని, ఆక్రమించిన వారి శిక్షార్హులుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
పోలేపల్లిలో భూ ఆక్రమణల తొలగింపు


