మత్స్యకారులను సీఎం వద్దకు తీసుకెళ్తా
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని కోరుతూ 51 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న మత్స్యకారులు కమిటీగా ఏర్పడి తనతో వస్తే సీఎం చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్తానని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. సోమవారం రాజయ్యపేట మత్స్యకారులు కొంతమంది మంత్రిని కలిశారు. బల్క్ డ్రగ్ రద్దు చేయాలని, దీని వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వాపోయారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ‘మీరంతా నావాళ్లు, మీపై ఎటువంటి కోపం లేదు. చర్చల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మీ సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరంతా కమిటీగా ఏర్పడి నాతో వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ డిమాండ్లు వివరిస్తానని’ చెప్పారు. మీ మీద ఉన్న అభిమానంతోనే మీరు నన్ను ఆడ్డుకున్నా, హైవేపై ఆందోళన చేసినా ఏమీ అనలేదన్నారు. వేట లేకుండా ఎన్నాళ్లు ధర్నా చేస్తారు. మీ ప్రాంతంలో సగభాగం వరకు స్టీల్‌ప్లాంట్ వస్తోంది. పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాజకీయాలు వద్దు అభివృద్ధిపై దృష్టిసారించండి అని హితవు పలికారు. దీనిపై మత్స్యకారులు మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేసుకుని సీఎంను కలవడానికి వస్తామని తెలిపారు. అప్పటివరకు పనులు ఆపాలని కోరారు. రాజయ్యపేట పరిధిలో పనులు జరగకుండా తాతత్కాలికంగా నిలుపుదల చేస్తాను’ అని మంత్రి హామీ ఇచ్చారు.


