బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన
రోలుగుంట: తమ రాకపోకలకు అంతరాయంగా ఉన్న బోడిమెట్ట బురదలో దిగి గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజన్నపేట వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ శరభవరం పంచాయతీ పరిధి రాజన్నపేటలో బోడిమెట్ట వద్ద నల్లరాయి క్వారీ కోసం కొత్తగా రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చారన్నారు. ఈ మార్గం బురదమయంగా మారడంతో రాజన్నపేట, వడ్డిప, గదబపాలెం, గుర్రాలబయిల, అర్ల గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. రాత్రిళ్లు ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు బురదలో కూరుకుపోయి పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో 108 వాహనం వెళ్లే అవకాశం లేదన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే బురద సమస్య మెరుగుపరచి రాకపోకలు సుగమం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన దశలువారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు నీలాపు శ్రీను, రమణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు.


