పెద్దేరు నది వంతెనపై స్తంభించిన ట్రాఫిక్
వడ్డాది వంతెనపై ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది వద్ద పెద్దేరు నది వంతెనపై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇటీవల తుఫాన్ వర్షాలకు ఇక్కడ డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. అప్పటి నుంచి వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో శిథిలమైన పాత వంతెనపై నుంచి రాకపోకలు సాగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి వడ్డాది వంతెనపై వందలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో గంటకుపైగా ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో వర్షం కురవడంతో వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ నుంచి హైస్కూల్ వరకు కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


