గాయపడిన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స
ప్రాణాలు కాపాడిన వైద్యుడు
సింధియా: తీవ్రంగా గాయపడిన అరుదైన, ఆరు అడుగుల శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేసి దాని ప్రాణాలను పశువైద్యుడు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సింధియా ప్రాంతంలో ఉన్న నేవీ క్యాంటీన్‌లో శ్వేతనాగు కనిపించడంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము పడగ భాగంలో తీవ్రంగా గాయపడి ఉండటాన్ని నాగరాజు గమనించారు. వెంటనే 40వ వార్డు పరిధి హిందూస్థాన్ షిప్‌యార్డ్ కాలనీలోని గాంధీగ్రామ్ పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి పశువైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ పామును పరీక్షించి, మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. గాయానికి మొత్తం ఎనిమిది కుట్లు వేశారు. పాము తలపై ఏదైనా వాహనం ఎక్కి ఉండవచ్చని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గాయం తగ్గిన తర్వాత పామును సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని నాగరాజు తెలిపారు.
గాయాలపాలైన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేస్తున్న పశువైద్యాధికారి సునీల్‌కుమార్
గాయపడిన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స


