 
															నదీ పరీవాహక గ్రామాల్లో అప్రమత్తం
అనకాపల్లి: తుఫాన్ కారణంగా నదీ పరీవాహక గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మండలంలో వెంకుపాలెం వెదుళ్లగెడ్డ వద్ద రహదారిపై ప్రవహిస్తున్న శారదానది నీటిని ఆయన మంగళవారం సర్పంచ్ రాపేటి నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుపై నుంచి వెదుళ్లగెడ్డ ప్రవహిస్తున్నందున వెంకుపాలెం, కుంచంగి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని పెట్టి వాహనాలు, ప్రజలు ఆ మార్గంలో వెళ్లకుండా నివారించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలను రాకపోకలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ అశోక్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎస్ బాల సూర్యారావు, రూరల్ ఎస్‌ఐ రవికుమార్, వెంకుపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి
తుఫాన్ కారణంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతే ప్రయాణాలు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపై ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) అధికారి వి.ప్రవీణను కలిసి ప్రయాణికుల బస్సులపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ ముంపునకు గురికాకుండా కాంప్లెక్స్‌లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ హనుపమశ్రీ, ట్రాఫిక్ మేనేజర్ గౌరీ, పట్టణ, ట్రాఫిక్ సీఐలు ప్రేమ్‌కుమార్, ఎం.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
వెంకుపాలెం వెదుళ్ల గెడ్డను
పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
