 
															తుపాను షెల్టర్లలో పోలీసులు తిష్ట
మేమెక్కడుండాలంటూ బోయపాడు మత్స్యకారుల ఆవేదన
నక్కపల్లి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన తుపాను రక్షిత భవనాల్లో పోలీసులు తిష్ట వేశారు. మండలంలో బోయపాడు తుపాను రక్షిత భవనంలో నెల రోజుల నుంచి పోలీసులు ఉంటున్నారు. ఇక్కడ బల్క్‌డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా రాజయ్యపేట, బోయపాడు గ్రామాల్లో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా వందలాది మంది పోలీసులను మోహరించారు. వీరిలో చాలామందికి బోయపాడు తుపాను రక్షిత భవనంలో వసతి కల్పించారు. 30 రోజుల నుంచి పోలీసులంతా తుపాను భవనంలోనే ఉన్నారు. మోంథా తుపాను కారణంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తీరానికి అతి సమీపంలో ఉన్న బోయపాడులో వెయ్యి మంది నివసిస్తున్నారు. తుపాను తీవ్రరూపం దాలిస్తే గ్రామానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కెరటాలు ఎగిసి పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి వస్తే గ్రామ మత్స్యకారులను తుపాను రక్షిత భవనాల్లోకే తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ భవనాల్లో పోలీసులు ఉండటంలో మత్స్యకారులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చి అర్ధరాత్రి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే తల దాచుకునేందుకు ఎక్కడ వెళ్తామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వేరొక చోట పోలీసులకు వసతి కల్పించి మత్స్యకారులకు పునరావాసం కల్పించేందుకు తుపాను షెల్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ విషయం తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి వద్ద ప్రస్తావించగా, బోయపాడు తుపాను షెల్టర్‌లో ఉన్న పోలీసులను ఖాళీ చేయిస్తున్నామన్నారు. మత్స్యకారుల కోసం అవసరమైన గదులు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
 
							తుపాను షెల్టర్లలో పోలీసులు తిష్ట

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
