 
															ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌పై జాతీయ సదస్సు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్(టీఎంసీ)–2025 జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఏయూ టీఎల్‌ఎన్ సభామందిరంలో ఈ సదస్సును వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ సీఈవో డాక్టర్ ఎం.కులకర్ణి ప్రారంభించి, మాట్లాడారు. కేవలం ఒక ఆలోచన పూర్తిస్థాయిలో వ్యాధుల్ని నయం చేయలేదన్నారు. ఆలోచన ఔషధంగా తయారుకావడానికి మధ్య అనేక అంశాలు ముడిపడి ఉంటాయని చెప్పారు. ట్రాన్స్‌లేషనల్ అంకాలజీ ప్రాముఖ్యతను వివరించారు. యువత, పరిశోధకులు విశాల దృక్పథం కలిగి ఉండడం, సవాళ్లను స్వీకరించే మనస్తత్వం అలవాటు చేసుకోవడం, అర్థమెటిక్ స్కిల్స్ పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. వైఫల్యాల నుంచి నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రధానమన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విభిన్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని, సంయుక్తంగా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయడం జరుగుతుందన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
