 
															రహ‘దారుణాలు’.. ఇంకెన్నాళ్లు?
చోడవరం: పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారిన అనకాపల్లి–వయా చోడవరం, నర్సీపట్నం రోడ్డు, వడ్డాది– మాడుగుల రోడ్డును వెంటనే బాగుచేయాలని కోరుతూ ప్రజాసంఘాలు, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు నిరశన దీక్షలకు దిగారు. చోడవరం తహసీల్ధార్ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పనులు చేయకపోవడంతో సుమారు 54 కిలోమీటర్లమేర మెయిన్‌రోడ్డంతా పెద్దపెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు బాగుచేయాలని కోరుతూ ఇప్పటికే న్యాయవాదులు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించడం, పలు విధాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం, కాంట్రాక్టర్ కనీస స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు చేపట్టలేదు. తాత్కాలికంగా గోతులు పూడ్చినప్పటికీ నాణ్యత లేకుండా పనులు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నూతులుగా మారి రాకపోకలు సాగించే వాహనాలు ప్రమాదాలకు లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని చోడవరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కామిరెడ్డి వెంకట్రావు ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరనాఽథ్‌బాబు, చోడవరం ఇన్‌చార్జి వేగి మహాలక్ష్మినాయుడు, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మదన్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పవన్‌కుమార్, మాడుగుల కాంగ్రెస్ ప్రతినిధి పడాల కొండలరావు, ఎం.నారాయణరావు, త్రినాథరావు దీక్షలో కూర్చున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా గోతులతో నిండిపోవడంతో అంబులెన్స్‌లు సైతం సకాలంలో రోగులను, క్షతగాత్రులను తీసుకొని ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రోడ్డు నిర్మాణపనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
