 
															ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రక్షణ
తీర, ముంపు ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తత
పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు
సిద్ధంగా ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
జిల్లా ప్రత్యేక అధికారి వి.వినయ్‌చంద్
తుమ్మపాల: మోంథా తుపాను ప్రభావానికి లోనయ్యే తీర, నదీ పరీవాహక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా ప్రత్యేక అధికారి వి.వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి పలు శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా చేసిన ముందస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విధులలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం, మంచినీరు, కరెంటు, చిన్నపిల్లలకు పాలు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చెట్లు పడిపోతే వెంటనే తొలగించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలాశయాలు, చెరువులలో నీటి ప్రవాహం నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడేందుకు అవకాశం గల గుర్తించిన ప్రాంతాలలో తక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఇసుక బస్తాలు, ఇతర మెటీరియల్ సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా ఆస్పత్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, 104, 108 వాహనాలు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రత్యేకాధికారి సమావేశం అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు సదుపాయం లేని 62 గిరిజన గ్రామాల ప్రజలను దగ్గరలో గల మైదాన ప్రాంతానికి తరలించాలని, అక్కడ పాఠశాలలు, ఆశ్రమపాఠశాలల్లో వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పాయకరావుపేటలోను, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని జిల్లా కేంద్రంలోను మోహరించామని, మరొక బృందం పంపించవలసినదిగా కోరామని, వారిని అచ్యుతాపురంలో వినియోగిస్తామన్నారు. జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
