 
															సత్ప్రవర్తనతో జీవితంలో మార్పు
నర్సీపట్నం: జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, విశాఖపట్నం సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు సోమవారం నర్సీపట్నం సబ్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. నేరాలు చేసి జైలులో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని, మీ ప్రవర్తనలో మార్పు రావాలని ఖైదీలకు సూచించారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తరువాత మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. బెయిల్ పెట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారు లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. నర్సీపట్నం లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్, సీఐ జి.గోవిందరావు, తహసీల్దార్ రామారావు, అగ్రికల్చర్ ఏడీ శ్రీదేవి, ఎంఈవోలు సిహెచ్.తలుపులు, నాగేంద్ర, న్యాయవాదులు గోవర్ధన్ గిరి, ఏఎస్‌డబ్ల్యూవో బాబురావు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
