 
															మా తరపున మాట్లాడేందుకు అనుమతించండి
అధికారులకు మత్స్యకారుల వినతి
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమానికి సంబంధించి మత్స్యకారుల తరపున కలెక్టర్‌తో మాట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ, వామపక్ష నాయకులను అనుమతించాలని కోరుతూ రాజయ్యపేట మత్స్యకారులు గురువారం తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి, సీఐ జూరెడ్డి మురళిలకు వినతి పత్రం ఇచ్చారు. మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్ రాజయ్యపేట వస్తున్నారు. మత్స్యకారుల తరపున కలెక్టర్‌తో మాట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీపీఐ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, గుర్రాజుపేట సర్పంచ్ దాట్ల ఉమాదేవిలతోపాటు తమ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న అందరినీ రాజయ్యపేట వచ్చి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్, సీఐలు చెప్పారు. మత్స్యకార నాయకులు ఎం.మహేష్, సోమేష్, పిక్కి తాతీలు, ఎం.జాన్, బి.బాబ్జి, కె.కాశీరావు, రామచరణ్, ప్రసాద్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
