 
															శివోహం.!
గొలుగొండ: పల్లెలు కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. గొలుగొండ మండలంలో ఉన్న మూడు ప్రధాన శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. శివ నామ స్మరణతో ఆయా ఆలయాలు మార్మోగుతున్నాయి. గొలుగొండ సమీపంలో ఉన్న దారమఠం శివాలయం, చీడిగుమ్మలలో కాశీ విశ్వేశ్వస్వామి ఆలయం, ఏఎల్‌పురం(కృష్ణదేవిపేట) గ్రామంలో ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయం కార్తీక మాస నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రం ధారమఠం
ప్రాచీన శైవక్షేత్రం ధారమఠం శివాలయం ఎంతో పేరొందింది. ధారకొండ దిగువన ఉన్న ఈ శివాలయం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మహా శివరాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుంది. శివాలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, అందులో జలజలపారే సెలయేర్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నర్సీపట్నం డివిజన్‌లో దారమఠం కార్తీకమాసంలో ప్రతి ఏటా సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ధారకొండ శివాలయం సమీపంలో కొండల నడుమ సెలయేర్లు, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడి అందాలను చూసి మైమరిచిపోతుంటారు.
కోరిన కోర్కెలు తీర్చే కాశీ విశ్వేశ్వరస్వామి
చీడిగుమ్మల వరాహనది తీరంలో ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆలయం నర్సీపట్నంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీ విశ్వేశ్వరస్వామిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తుంటారు.
శివమాలలకు ప్రసిద్ధి నీలకంఠేశ్వరస్వామి
అల్లూరి నడయాడిన ప్రాంతం, అల్లూరి సీతారామరాజుతో నిత్యం పూజలందుకున్న స్వామి నీలకంఠేశ్వరస్వామి. కృష్ణదేవిపేట అల్లూరి పార్కు పక్కనే ఉన్న బొడ్డేరు గెడ్డకు ఆనుకొని ఈ ఆలయం ఉంది. ఇక్కడ కార్తీకమాసం, మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఆలయం వద్ద కార్తీక మాసంలో వందలాది మంది భక్తులు శివమాలలు ధరించి స్వామి వారి సన్నిధిలో ఉండి పూజలు చేస్తుంటారు. బొడ్డేరు గెడ్డలో స్నానాలు ఆచరించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా మండలంలో మూడు శివాలయాలు ఎంతో ప్రాముఖ్యతతో విరాజిల్లుతున్నాయి.
 
							శివోహం.!
 
							శివోహం.!
 
							శివోహం.!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
