 
															సాగర తీరాన మాయా ప్రపంచం
ఏయూక్యాంపస్: అడుగుపెట్టిన గదిలో ఎక్కడ ఉన్నామో తెలియకపోతే? అనంతమైన విశ్వంలో తేలియాడుతున్న అనుభూతి కలిగితే? మన కళ్లే మనల్ని మోసం చేస్తే.? విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు మన విశాఖ నగరానికి వచ్చేసింది. బీచ్‌రోడ్డులోని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలోనే ఇమ్మర్సివ్ మ్యూజియం లేదా ఆర్ట్ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా యువతకు, పిల్లలకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఈ మ్యూజియంలో మొత్తం 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉంటాయి. ఒక్కో గది ఒక్కో ప్రత్యేకమైన థీమ్‌తో మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. గదిలోకి అడుగుపెట్టగానే.. ఆ గది పొడవు, వెడల్పు అంచనా వేయడం అసాధ్యం. గదికి ఆరు వైపులా (నేల, పైకప్పు, నాలుగు గోడలు) అద్దాలు ఉండటంతో.. మన కళ్లు కనికట్టుకు గురవుతాయి. ప్రతి గది ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అద్దాల మండపం, మిర్రర్ ఇమేజ్, కెలిడోస్కోప్, రివాల్వింగ్ టన్నెల్, స్టార్ ఇన్ స్కై, అవతార్ రూమ్, రెయిన్‌బో కలర్, పెరల్ కర్టెన్స్ వంటి థీమ్స్..అద్భుత ఊహలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. నేవీలో పని చేసి పదవీ విరమణ చేసిన రమణ కుమార్ ఈ అద్భుతానికి రూపకల్పన చేస్తున్నారు. ఆయన దుబాయ్‌లో ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఆ సరికొత్త అనుభూతిని నగరవాసులకు, పర్యాటకులకు అందించాలనే సంకల్పంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ అద్దాల మాయా లోకం ప్రారంభమై.. సాగర తీరానికి కొత్త ఆకర్షణగా నిలవనుంది.
 
							సాగర తీరాన మాయా ప్రపంచం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
