 
															‘సమృద్ధి గ్రామ పంచాయతీ’కి కశింకోట ఎంపిక
కశింకోట: జిల్లాలో కశింకోట పంచాయతీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సమృద్ధి గ్రామ పంచాయతీ’పథకాన్ని అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.వరప్రసాద్ తెలిపారు. కశింకోటలో గురువారం బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో సమృద్ధి గ్రామ పంచాయతీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మరింత మందికి ఇంటర్నెట్ సేవలను చేరువ చేసి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సాయపడతామన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాలోని 172 పంచాయతీల్లో 28,968 సెల్ టవర్ల ద్వారా 1,08,733 బేస్ ట్రాన్సివర్ స్టేషన్లను ఏర్పాటు చేసి 2.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశామన్నారు. వీటి ద్వారా కేబుల్ సేవలు ప్రజలకు విస్తృతంగా చేరువ అవ్వడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ పథకం కింద ఆప్టికల్ కేబుల్ సేవలు చేరువ చేయడంలో భాగంగా కశింకోటను ప్రభుత్వం ఎంపిక చేసిందని, పథకం సమర్థవంతంగా అమలు కావడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ పథకం అమలుకు డిజిటల్ యాక్సిస్ కమిటీని ఈ సందర్భంగా నియమించారు. మంత్రి జయరజని చైర్ పర్సన్‌గా వ్యవహరించే కమిటీలో పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గాను, సభ్యులుగా పీహెచ్‌సీ వైద్యులు, రిటైర్డు ఎంఈవో, స్కూలు హెచ్‌ఎం, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఉంటారు. బీఎస్‌ఎన్‌ఎల్ విశాఖ పీజీఎం జి.ఆడమ్, ఐటీఎస్ సిహెచ్.కుశాల్ రాం, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
