 
															రీసర్వే షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి
జేసీ ఎం.జాహ్నవి 
తుమ్మపాల: రీసర్వే కార్యక్రమం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జేసీ ఎం.జాహ్నవి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ శాఖలో పలు అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రీసర్వే లో మొత్తం 30 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించి గ్రామసరిహద్దులు నిర్ణయించి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, రీసర్వేపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రీ సర్వే కార్యక్రమంలో 80 సర్వే బృందాలు పని చేస్తున్నాయన్నారు. సర్వేలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై డివిజను, మండల స్థాయి కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్ చేసి రశీదు అందించాలన్నారు. ప్రభుత్వ భూముల సర్వే చేయాలని, ఎక్కడైనా ఆక్రమణలను గుర్తించినట్టయితే ఆక్రమణదారులకు నోటీసులు అందజేయాలన్నారు. మండల స్థాయి సమన్వయ కమిటీకి సిఫార్సు చేసిన సివిల్ కేసులను శతశాతం పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు. రేషను షాపులు, బియ్యం బిల్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, సివిల్ సప్లయి అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ స్మార్ట్ కార్డులు శతశాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. దీపం పథకానికి సంబంధించి ఎవరికై నా రీపేమెంటులో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి లబ్ధిదారులందరికీ డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, రెవిన్యూ డిజినల్ అధికారులు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సప్లయి అధికారి మూర్తి, సర్వే సహాయ సంచాలకులు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
