 
															అష్ఫాకుల్లా ఖాన్‌ను విస్మరించడం దురదృష్టకరం
సీతంపేట: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం దురదృష్టకరమని ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ(ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ ముస్లిమ్స్ కల్చరల్ అండ్ లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకోరి రైలు దాడిలో పాల్గొన్నందుకు అష్ఫాకుల్లా ఖాన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబరు 19న ఉరి తీసిందని గుర్తుచేశారు. ఆ సమయానికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే అన్నారు. భగత్‌సింగ్, చంద్రశేఖర ఆజాద్ లాగే దేశం కోసం పోరాటం చేసిన అష్ఫాకుల్లా ఖాన్ గురించి పెద్దగా తెలియక పోవడం మత వివక్షే కారణమన్నారు. డిసెంబరు 19న అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతిని ప్రభుత్వ తరపున నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నారని, మన రాష్ట్రం కంటే తక్కువ ముస్లిం జనాభా ఉన్న తమిళనాడులో 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఏఐబీఎస్పీ ముస్లిం హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. ముందుగా అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విశ్రాంత సీఐ ఎలియాజ్ అహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్షేత్రపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, కార్పొరేటర్ బర్కత్ ఆలీ, ప్రొఫెసర్ ఇక్బాల్, డాక్టర్ ఖాజా, తులసీదాస్, ఫసుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
ఆయన వర్ధంతిని ప్రభుత్వమే
నిర్వహించాలి: మాజీ డీజీపీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
