 
															అల్పపీడనం.. అప్రమత్తం
తుమ్మపాల: అల్పపీడనంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అఽధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు తెలిసేలా ఫోన్ నెంబర్లు ప్రచారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 08924 288888, 08924 225999, 08924 226599 కు ఫోన్ చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్ డబ్ల్యూలతో సహా ఎవరూ ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు. జిల్లాలో గుర్తించిన 125 గ్రామాల లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, స్లాబ్‌లు పడిపోయే అవకాశం ఉన్న భవనాలు, మట్టి ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత భవనాల్లోకి మార్చాలన్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, ఆనకట్టలు తనిఖీ చేయాలన్నారు. రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించడానికి అవసరమయ్యే పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జేసీబీలు సిద్ధం చేయాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మంచినీళ్లు కలుషితం కాకుండా చూడాలన్నారు. హైరిస్కు గల గర్భిణులను ముందుగా ఆస్పత్రికి తరలించాలన్నారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే గంట సమయంలో పునరుద్ధరించేటట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు కావలసిన నిత్యావసర సరకులు సేకరించి నిల్వ చేసుకోవాలని, నిర్వాసితులకు సకాలంలో పంపిణీ చేయాలన్నారు. జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి మూర్తి, పంచాయతీ అధికారి సందీప్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
