 
															మత్స్యకారులపై ఎందుకంత కక్ష?
శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామన్నారు. ఏ ప్రభుత్వమైనా కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు స్థానికులను ఒప్పించి వారి ఆమోదంతోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, మీ ప్రజాప్రతినిధి, హోం మంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చేక మరోలా మాట్లాడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్‌పార్క్ పనులు ఆపేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చేక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులపై ఎందుకంత కక్ష అని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పడు ఆయా ప్రాంతాల వారిని ఒప్పించి వారి ఆమోదం మేరకు సెజ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తాము ఇక్కడకు రాజకీయం చేయడానికి రాలేదని, మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి వారికి మద్దతు ఇవ్వడం కోసమే వచ్చామన్నారు. మీ ఊళ్లోకి మీరు రావడానికి ఆధార్ కార్డు చూపించాల్సి రావడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రాణాలు కాపాడుకోడానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక రద్దు చేస్తామని, మీరేమీ భయపడొద్దన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
