 
															నూకరాజు సేవలు చిరస్మరణీయం
జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
మహారాణిపేట: కొయ్యూరు మండలం జెడ్‌పీటీసీ వారా నూకరాజు అత్యంత సౌమ్యుడు, నిగర్వి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణాధికారి(సీఈవో) పి.నారాయణమూర్తి కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారా నూకరాజు సంతాప సభ నిర్వహించారు. తొలుత నూకరాజు చిత్రపటానికి సీఈవో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూకరాజు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్ మాట్లాడుతూ నూకరాజు మరణం జిల్లా ప్రజా పరిషత్‌కు తీరని లోటు అన్నారు. నూకరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
