 
															అబ్బురపరిచిన యోగా విన్యాసాలు
చోడవరం: చోడవరం ఉషోదయ కాలేజీలో పతంజలి యోగా శిక్షణా కేంద్రం గురువు పుల్లేటి సతీష్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగాసాల పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు, పురుషులు, సీ్త్రలు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారు. 8నుంచి 80 సంవత్సరాలు వయస్సు ఉన్నవారంతా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు. 8–14 వయస్సు విభాగంలో బాలురు 50, బాలికలు 35 మంది పాల్గొన్నారు. 14–20 విభాగం లో బాలురు 25, బాలికలు 15 మంది, 30–40 విభాగంలో పురుషులు 12, సీ్త్రలు 10 మంది, 40–50 విభాగంలో పురుషులు 10, సీ్త్రలు 8మంది, 50–60పైబడిన విభాగంలో పురుషులు 8, సీ్త్రలు ఆరుగురు పాల్గొన్నారు. ప్రధానంగా వృశ్చికాసనం, గండబెరండాసనం, కృకుటాసనం, సూర్యనమస్కారాలు ఆసనాల్లో ఎక్కువగా పోటీ జరిగింది. యోగా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షుడు పప్పల రమణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 48 మందిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. వీరంతా ఈనెల 25, 26తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ బహుమతులు అందజేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
