 
															చర్చలకు కలెక్టర్ కబురు
ఆదివారం గ్రామసభ నిర్వహిద్దామని ఆర్డీవోతో వర్తమానం ముందు రోజు రాత్రి 9 గంటలకు చెప్పడంతో మత్స్యకారుల అసంతృప్తి
రెండు రోజుల ముందే చెప్పాలి
అప్పటికప్పుడు చెబితే చర్చలకు రాలేమన్న గంగపుత్రులు
దీపావళి వెళ్లాక తేదీ నిర్ణయించమని వినతి పత్రం
నక్కపల్లి: ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు చర్చలకు రావాలంటే తమకు సాధ్యం కాదని రాజయ్యపేట మత్స్యకారులు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా దాదాపు 35 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు ఆదివారం వస్తున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కబురు చేశారు. దీపావళి తర్వాత రెండు రోజులు ముందుగా చెప్పి రావాలని వారు వినతి పత్రం ఇచ్చారు. గత ఆదివారం మత్స్యకారులంతా జాతీయరహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 15వ తేదీన రాజయ్యపేటలో గ్రామసభ నిర్వహిస్తానని ఆ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు. అయితే ఆమె హఠాత్తుగా వ్యక్తిగత పని మీద చైన్నె వెళ్లడంతో ఆ సభ వాయిదా పడింది. శనివారం రాత్రి నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ నర్సింహమూర్తిలతో గ్రామస్తులకు వర్తమానం పంపించారు. ఆదివారం ఉదయం పది గంటలకు కలెక్టర్ వస్తున్నారని, గతంలో హామీ ఇచ్చిన మేరకు చర్చలు జరుపుతారని తెలియజేశారు. అయితే అంత అకస్మాత్తుగా చర్చలు సాధ్యం కావని మత్స్యకారులు స్పష్టం చేశారు. తమ వారంతా వివిధ పనులపై బయటకు వెళ్లిపోయారని, ముందుగా సమాచారం ఇచ్చి రావాలని తెలిపారు. ఆదివారం ఉదయాన్నే ఆర్డీవో, తహసీల్దార్, డీఎస్పీలు రాజయ్యపేట చేరుకున్నారు. ఇప్పటికే గ్రామంతోపాటు, చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యిమందికి పైగా మోహరించిన పోలీసులు కలెక్టర్ వస్తున్నారన్న సమాచారంతో మరింతమందిని రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి పోలీసులను, స్పెషల్ పార్టీ సిబ్బందిని రప్పించారు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
తొలుత దీక్షకు విరామం.. అనంతరం యథాతథం
అప్పటికప్పుడు చర్చలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు తొలుత ఆదివారం నిరాహార దీక్షను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కలెక్టర్ చర్చలకు వస్తానని చెప్పడంతో అసంతృప్తి చెందిన మత్స్యకారులంతా ఆదివారం నిరాహారదీక్షకు విరామం ప్రకటించారు. జెడ్పీటీసీ గోసల కాసులమ్మ ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు సోమేష్, మహేష్, కాశీరావు, సోమేశ్వరరావు, పిక్కి స్వామి, మైలపల్లి సూరిబాబు తదితరులు ఆర్డీవో వద్దకు వచ్చి వినతి పత్రం ఇచ్చారు. రాత్రికి రాత్రి వచ్చి చర్చలు అంటే కుదరదన్నారు. రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని, వివిధ పనుల మీద వెళ్లిన వారిని తిరిగి స్వగ్రామాలకు రప్పిస్తామన్నారు. దీపావళి అనంతరం రెండు రోజుల ముందు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తమకు సంఘీభావం తెలిపే వారిని, తమ తరపున చర్చల్లో పాల్గొనే వారిని అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. వందలాది మంది పోలీసులు గ్రామం చుట్టు వలయంగా ఏర్పడ్డారని, గ్రామంలోకి ఎవరినీ రానివ్వడం లేదని, ఆధార్ కార్డు చూపిస్తే తప్ప గ్రామంలోకి అడుగు పెట్టనివ్వడం లేదన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పెట్టి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఇంతమంది పోలీసులను ఎందుకు కాపలా పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే గ్రామం నుంచి పోలీసులను ఖాళీ చేయించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పనులు మొదలు పెడుతున్నారని, గతంలో హోంమంత్రి, కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు పనులు తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. కలెక్టర్‌తో చర్చలు పూర్తయ్యేవరకు తాము శాంతియుతంగా నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడమని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం దీక్షకు విరామం ప్రకటించిన మత్స్యకారులు మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఆందోళన ప్రారంభించారు.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే..!
ఒకపక్క మత్స్యకారుల ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మరోపక్క వైఎస్సార్‌సీపీ ఈనెల 22న ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసార కన్నబాబు పాల్గొంటారని ప్రకటించడంతో.. ప్రతిపక్ష నేతలు రాజయ్యపేట వస్తే వైఎస్సార్‌సీపీకి మైలేజీ పెరగడంతోపాటు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద ఆదివారం మత్స్యకారులతో చర్చలు జరిపి నిరాహార దీక్షకు ముగింపు పలకాలని కలెక్టర్‌కు సూచించినట్లు సమాచారం.
 
							చర్చలకు కలెక్టర్ కబురు
 
							చర్చలకు కలెక్టర్ కబురు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
