 
															చీకటి వెలుగుల దీపావళి
● ఈ ఏడాది కానరాని సందడి
● మందకొడిగా బాణసంచా విక్రయాలు
● డీలాపడ్డ సాధారణ మార్కెట్
సాక్షి, అనకాపల్లి: చీకట్లను పారదోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండగ ఈ ఏడాది ప్రజలకు, వ్యాపారులకు నిరాశే మిగులుస్తోంది. నిత్యావసరాలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుడికి దీపావళి పండగ భారంగా మారింది. ఈ ఏడాది బాణసంచా ధరలు 20 నుంచి 25 శాతం పెరగడం.. 40 శాతానికి పైగా వ్యాపారం తగ్గడంతో ఇటు వ్యాపారస్తుల్లో మరింత దిగులు మొదలైంది. దీనికి తోడుగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో చివరి క్షణం వరకు స్టాళ్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వ్యాపారస్తులు మరింత మండిపడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్ల వారు బాణసంచా వ్యాపారాలకు అనుమతి త్వరితగతిన ఇవ్వాలంటే ముందు కూటమి నేతల్ని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. పచ్చ నేతలు చెప్పిన వారికే పర్మిషన్లు ఇచ్చారు. ఇటు వ్యాపారం లేదు.. అటు మామూళ్లు ఇస్తే గానీ అనుమతి ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. మరికొందరు వ్యాపారస్తులైతే ఈ ఏడాది వ్యాపారానికి స్వస్తి చెప్పేశారు.
వ్యాపారాలు వెలగలేదు..
గతేడాది అంతంతమాత్రంగానే ఉండటంతో.. ఈసారైనా వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు ఆశ పెట్టుకున్నారు. కానీ.. మతాబుల్లా వెలిగిపోతాయనుకుంటే.. మబ్బు పట్టినట్లుగా డల్‌గా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 226 షాపులకు అనుమతులివ్వగా.. ఇందులో కూటమి నేతలకు చెందినవి, వారు సిఫార్సు చేసిన దుకాణాలే 200 వరకూ ఉంటాయని తెలుస్తోంది. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. అనకాపల్లి పరిధిలో 5, యలమంచిలి 4, నర్సీపట్నం పరిధిలో 2 ఏర్పాటు చేశారు. అయితే.. చచ్చీ చెడీ.. ఎలాగోలా పర్మిషన్లు తీసుకున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడంతో.. వ్యాపారాలు వెలగడం లేదు. ఆదివారం రాత్రి వరకూ అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరిగాయి. దీపావళి రోజున మధ్యాహ్నం వరకూ జరిగే కొనుగోళ్ల పైనే తమ లాభాలు ఆధారపడి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఈపాటికే.. 70 శాతం వరకూ స్టాక్ విక్రయాలు జరిగిపోయేవనీ.. ఈసారి 40 శాతం కూడా కొనుగోళ్లు జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు.
 
							చీకటి వెలుగుల దీపావళి
 
							చీకటి వెలుగుల దీపావళి
 
							చీకటి వెలుగుల దీపావళి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
