 
															గుండె నిండా స్వాభిమానం.. అదే మా ఉద్యమానికి ‘ఆధార’ం
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలో పోలీసుల వైఖరి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గ్రామంలోకి వచ్చి వెళ్లే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లినప్పుడు, గ్రామంలోకి వచ్చినప్పుడు పోలీసులు అడిగే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం తమ వల్ల కావడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆధార్ చూపిస్తే తప్ప గ్రామంలోకి రానివ్వడం లేదని యువకులు చెబుతున్నారు. తనిఖీలో ప్రతిసారి ఆధార్ కార్డు చూపించడం తమ వల్ల కావడం లేదంటూ కొంతమంది యువకులు ‘బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు’ అంటూ టీ షర్ట్‌లు తయారు చేయించారు. వెనుక పక్క ఉద్యమ నినాదం, ముందు పక్క బనియన్ ధరించిన వ్యక్తి ఆధార్ కార్డు, ఫొటోను ముద్రించారు. వీటిని ధరించి నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. రాజయ్యపేట నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా వీటిని ధరించి వెళ్తున్నారు. పోలీసులకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు చూపించే అవసరం లేకుండా తాము ధరించిన టీ షర్ట్‌లపై ఆధార్ కార్డు, ఫొటో, బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అనే నినాదాన్ని రాయించారు. ప్రస్తుతం రాజయ్యపేటలో ఈ టీ షర్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రాజయ్యపేటలో ప్రత్యేక ఆకర్షణగా టీ షర్ట్‌లు
ఆధార్ కార్డు, బల్క్ డ్రగ్ ఉద్యమం ముద్రణ
చెక్ పోస్టుల వద్ద ఐడెంటిటీ అడుగుతున్న పోలీసులు
గుండైపెనున్న ఆధార్ ముద్రను చూపుతున్న మత్స్యకారులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
