 
															కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
గొలుగొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత ఆరోపించారు. శనివారం ఏఎల్‌పురంలో తన ఇంటి వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే మహిళలను దారుణంగా వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. కల్తీ మద్యం తాగి చనిపోతున్న వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయన్నారు. కూటమి నేతలకు డబ్బులు తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదన్నారు. కల్తీ మద్యంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి జీడీ నెల్లూరులో మాట్లాడితే అదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ అతి దారుణంగా వ్యాఖ్యలు చేసి అవమానించారన్నారు. కృషాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మహిళను కించపరిచిన ఎమ్మెల్యేపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. కూటమి పాలనలో మహిళల రక్షణపై ఆందోళన కలుగుతోందన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
