 
															యూరియా కోసం ఎదురు చూపులు
కశింకోటలో ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం వేచి ఉన్న రైతులు
కశింకోట: యూరియా అరకొర సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనక తప్పలేదు. శుక్రవారం స్థానిక ప్రైవేటు ఎరువుల డీలర్ దుకాణం వద్ద గంటల తరబడి బారులు తీరారు. ప్రస్తుతం ఎదుగుదల, పొట్ట దశలో వరి పంట ఉంది. కొందరు ఆలస్యంగా నాట్లు వేశారు. ఈ నేపథ్యంలో యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉంది. లేదంటే పెరుగుదల ఉండదు. యూరియా ఇవ్వనున్నట్లు తెలియడంతో రైతులు ఎరువు కోసం దుకాణం వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. అరకొరగా తక్కువ నిల్వ ఉన్న మేరకు సరఫరా చేశారు. మిగిలిన వారికి ఈ నెల 22న రావాలని, ఆ రోజుకి మళ్లీ యూరియా రానుందని డీలర్ పేర్కొని వెనక్కి పంపించి వేశారు. దీంతో కశింకోటతోపాటు ఏనుగుతుని, ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా కష్టాలు ఎన్నాళ్లకు తీరేనో అంటూ తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
