 
															యథేచ్ఛగా మెటల్ అక్రమ తరలింపు
చోడవరం: కూటమి పాలనలో దోచుకున్నవారికి దోచుకున్నంతగా అన్నట్టుగా అక్రమార్కులు కొండలను కొల్లగొడుతున్నారు. మండలంలో మైన్స్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గోవాడ, ముద్దుర్తి, నర్సాపురం, రాయపురాజుపేట, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, వెంకన్నపాలెం, ఎం. కొత్తపల్లి, దుడ్డుపాలెం గ్రామాల పరిధిలోని కొండల్లో యథేచ్ఛగా మెటల్ అక్రమ క్వారీలు నడుస్తున్నాయి. గోవాడలో ఏకంగా కొండను తవ్వేసి మెటల్ అమ్మేసుకోవడంతోపాటు రహదారులే ఏర్పాటు చేసుకుంటున్నాడో ప్రబుద్ధుడు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, మైన్స్ శాఖల అనుమతి పొందాల్సి ఉంది. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకుని తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రిళ్లు ఎక్కువగా ఇక్కడ క్వారింగ్ జరుగుతోంది. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గోవాడలో రియల్టర్లతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు, ముద్దుర్తి, నర్సాపురం, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కొండలను తవ్వేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు గ్రామాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలంటూ మొక్కుబడిగా కమిటీలు వేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఎక్కడా క్వారీ తవ్వకాలను నిరువరించడంలేదు. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
							యథేచ్ఛగా మెటల్ అక్రమ తరలింపు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
