 
															వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు ఢీ..
నవ వధువు మృతి
భర్తకు తీవ్ర గాయాలు
కూర్మన్నపాలెం: కూర్మన్నపాలెం కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున మృత్యువు కాపు కాసింది. పైళ్లె ఏడాదైన జంట స్కూటీపై ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వారి జీవితాలపై కబళించింది. నిండు నూరేళ్ల దాంపత్యం ఒక్క క్షణంలోనే విషాదంగా ముగిసింది. కూర్మన్నపాలెం ముఖ్య కూడలి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదగంట్యాడ మండలానికి చెందిన వియ్యపు ఉమాదేవి(22) మృతి చెందగా, ఆమె భర్త పైడిరాజు గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలివి.. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వియ్యపు పైడిరాజు, తన తల్లిదండ్రులు, భార్యతో కలిసి పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నాడు. అనకాపల్లి మండలం కొత్తూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున భార్య ఉమాదేవితో కలిసి స్కూటీపై ఇంటి వద్ద బయలుదేరాడు. కూర్మన్నపాలెం కూడలికి సమీపిస్తున్న సమయంలో.. సింథియా నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి స్కూటీని బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉమాదేవి కుడి వైపునకు, పైడిరాజు ఎడమ వైపునకు పడిపోయారు. ఉమాదేవిపై నుంచి బస్సు చక్రాలు దూసుకుపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పైడిరాజుకు నడుము భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఉమాదేవికి, పైడిరాజుకు వివాహం జరిగి ఏడాది కావస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఉమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
సీతానగరంలో విషాదచాయలు
పెదగంట్యాడ: ఉమాదేవి దుర్మరణంతో సీతానగరంలో విషాదచాయలు అలుముకున్నాయి. పెళ్లాయిన ఏడాదికే ఆమెను మృతువు బస్సు రూపంలో కబళించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
