 
															ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 11 అర్జీలు
పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ తుహిన్ సిన్హా
ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ జాహ్నవి
తుమ్మపాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమైన, అవకాశం ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మొత్తం 11 మంది ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. రెవెన్యూ శాఖ–3, వైద్య ఆరోగ్య శాఖ– 2, ఖజానా శాఖ, గ్రామీణ అభివృద్ధి, సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్, విద్యా శాఖ, వెనకబడిన తరగతుల శాఖ, మున్సిపల్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి విజయ్ కుమార్, పీజీఆర్‌ఎస్ సెల్ పర్యవేక్షకుడు సురేష్ నాయుడు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలపై ఎస్పీ తుహిన్ సిన్హాకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యమని, సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి మొత్తం 8 అర్జీలు అందాయన్నారు.
 
							ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 11 అర్జీలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
