 
															మహాలక్ష్మినాయుడుకు రాష్ట్ర స్థాయి పురస్కారం
అవార్డు, ప్రశంసా పత్రం అందుకుంటున్న మహాలక్ష్మినాయుడు
రావికమతం: మండలంలోని మేడివాడ హైస్కూల్‌కు చెందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు బి.మహాలక్ష్మినాయుడు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఆయన్ను సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఎంపిక చేశారు. విజయవాడలో రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం స్టేట్ కో–ఆర్టినేటర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.అన్నపూర్ణ నుంచి ప్రశంసాపత్రం, అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహిత విద్య సమన్వయకర్త రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు.
ఫీజు చెల్లించలేదని ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదు
తగరపువలస : భీమిలి మండలం దాకమర్రి ఎన్‌ఎస్‌ఆర్‌ఐఈటీ కళాశాల యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులను ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయనందున కళాశాలల యాజమాన్యాలు నిర్వహణ ఖర్చులు భరించలేక విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఆర్‌ఐఈటీ యాజమాన్యం విద్యార్థులు రూ.10 వేల చొప్పున చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని చెప్పడంతో కొందరు విద్యార్థులు చెల్లించారు. ఫీజు చెల్లించలేని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రాధేయపడినా యాజమాన్యం అనుమతించలేదని వాపోయారు. కళాశాలకు చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులు చెల్లించినా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలో విఫలం కావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ ఖాదర్‌బాబాను వివరణ కోరగా ఫీజు చెల్లించని విద్యార్థులను ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదనన్నది వాస్తవం కాదన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
