
సకాలంలో చికిత్స.. యువకుడికి ఊరట
గోపాలపట్నం: ఆర్పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి గుండెనొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రైల్వే పొలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు ఖరగ్‌పూర్ నుంచి వెలుపుల మనోహర్ విశాఖ వచ్చాడు. సింహాచలంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నాడు. గిరిప్రదక్షిణ అనంతరం శుక్రవారం రాత్రి షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ నుంచి ఖరగ్‌పూర్‌కు బయలుదేరాడు. ట్రైన్ ఎక్కిన తరువాత కొద్దిసేపటికే ఏసీ బోగీలో ఉన్నా చెమటలు పట్టడంతో బంధువులకు సమాచారమందించాడు. వెంటనే సింహాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆర్‌పీఎఫ్ పోలీసులకు విషయం తెలియజేశారు. అదృష్టవశాత్తు రెడ్ సిగ్నల్ పడడంతో ఈ ట్రైన్ సింహాచలం రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై ఆగింది. దీంతో హుటాహుటిన వీల్‌చైర్‌తో వెళ్లి బాధితుడిన ట్రైన్ దించారు. 108కు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో ఏఎస్‌ఐ సీతారామ్ తన ద్విచక్రవాహనంపై గోపాలపట్నం బెహరా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తరువాత అతని ఆరోగ్యం కుదుట పడింది. ఉదయం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పంపించారు. సకాలంలో స్పందించి వైద్య సేవలు అందే విధంగా కృషి చేసిన రైల్వే పోలీసులకు మనోహర్, అతని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
సత్వరం స్పందించిన ఆర్పీఎఫ్