నర్సీపట్నం : నర్సీపట్నం మెయిన్ రోడ్‌లో ఉన్న బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతాన్ని గురువారం సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్ పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమకు చిహ్నంగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మండల న్యాయ సేవాధికార సంస్థకు అందిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నుండి కోర్టు వారు వివరాలు సేకరించారు. తాజాగా సమాచారం కోసం పురావస్తుశాఖకు కోర్టు వారు నోటీసు జారీ చేయడంతో ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గుణరావు గురువారం నర్సీపట్నం విచ్చేశారు. పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సర్వేయర్‌ల తో సీనియర్ సివిల్ జడ్జి ఆ సమాధుల ప్రాంతాన్ని పరిశీలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సమాధుల ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.