
మా భూములకు రక్షణ కల్పించండి
● ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజనుల బైటాయింపు
నర్సీపట్నం : మా భూములను కాపాడాలంటూ మాడుగుల మండలం, గదబూరు గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాబు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ఆర్డీవో గారూ.. మా భూములకు రక్షణ కల్పించండి’ అంటూ నినాదాలు చేశారు. గిరిజన కుటుంబాలకు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.జనార్దన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో ఉన్న గిరిజనులకు ప్రభుత్వం అటవీహక్కుల చట్టం ప్రకారం పట్టాలు మంజూరు చేసిందన్నారు. 30 ఏళ్లుగా జీడిమామిడి తోటలను సాగు చేసుకుని ఫలసాయం అనుభవిస్తున్నారన్నారు. భూ మాఫియాదారులు జేసీబీలతో జీడి చెట్లను నేలమట్టం చేశారన్నారు. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.
ఆర్డీవోకు ఇప్పటికే రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసినా స్పందనలేదన్నారు. ఎస్‌ఐకి గిరిజనులు ఫిర్యాదు చేస్తే భూ మాఫియా జోలికి వెళ్ల వద్దని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఈ జీడితోటలు తప్ప వేరే జీవనోపాధి లేదని, ఆర్డీవో స్పందించి భూ మాఫియా నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.