
స్టోన్ క్రషర్ లీజ్ రద్దు చేయాలని నిరసన
మాకవరపాలెం మండలం జి.కోడూరులో సర్వే నంబర్ 332లో కొండ పోరంబోకు ఆనుకుని 98 ఎకరాల్లో 13 బీసీ, 23 ఎస్సీ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి నివసిస్తున్నాయి. ఇక్కడ 2018 ఫిబ్రవరి 21న 24 హెక్టార్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 20 సంవత్సరాల కాలవ్యవధికి రాధాకృష్ణ కనస్ట్రక్షన్‌కు క్వారీ లీజు మంజూరు చేసింది. సదరు సంస్థ 2020 మే 9వ తేదీన టీడీపీకి నేతకు సబ్ లీజ్‌కు ఇచ్చింది. ఈయన నడుపుతున్న స్టోన్ క్రషర్ వల్ల 36 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, తక్షణమే నిలుపుదల చేయాలని మాకవరంపాలెం తహసీల్దార్‌కు బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జి.కోడూరు గ్రామం మాదిగ సంఘం ప్రతినిధులు ధర్నా చేపట్టారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపల్లి జాన్ మార్కు, జి.కోడూరు మాదిగ సంఘం ప్రతినిధి ఎ.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.