
ఏం తిని బతకాలి..!
కోటవురట్ల: పొట్టకూటి కోసం ఉపాధి పని చేస్తున్న కూలీల కడుపులు మాడ్చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతాకాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పందూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు బుధవారం నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన కూలీలు రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం నియమ నిబంధనలను మార్చడమే కాకుండా, పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రాల చేతిలో ఉన్న పథకం అమలు, ఉపాధి పనుల కల్పన, అంచనా వ్యయం తదితర అంశాలు ఇకపై కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యుక్తధార యాప్ ద్వారానే ఇకపై కూలీల వేతనాలు చెల్లించనున్నారన్నారని చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతం మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ యాప్ వినియోగం ద్వారా ఇకపై రాష్ట్రాల ప్రమేయం పూర్తిగా ఉండదని, కేంద్ర ప్రభుత్వమే అన్ని పనులు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకుని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వెంటనే 10 వారాల వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.