
సింహాచలం ప్రధానార్చకుడు కన్నుమూత
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు ఇరగవరపు వెంకట రమణాచార్యులు (58) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు ఈ నెల 19న గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మరణించారు. రమణాచార్యులు 1992లో అధ్యాపకుడిగా సింహాచలం దేవస్థానంలో ఉద్యోగంలో చేరారు. 1994లో అర్చకుడిగా, 2020లో ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందారు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి జరిగే వార్షిక ఉత్సవాలు, నిత్య పూజల నిర్వహణలో రమణాచార్యులు తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా స్వామివారి వార్షిక కల్యాణోత్సవం రోజుల్లో జరిగే ఎదురు సన్నాహోత్సవ ఘట్టంలో పూలదండలతో ఆయన చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. రమణాచార్యులకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.