
డొంకాడ దాడిపై డీఎస్పీ విచారణ
నక్కపల్లి: డొంకాడలో దళితులపై తెలుగుదేశంపార్టీకి చెందిన అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటనపై మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో విచారణ నిర్వహించారు. వివాహ సమయంలో పెళ్లికొడుకు సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో దానిని మైక్, లైటింగ్ ఏర్పాటు చేసిన దళిత యువకులే తీశారంటూ పెళ్లికొడుకుతోపాటు అగ్రవర్ణాలకు చెందిన పలువురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టిన సంగతి తెలిసిందే. అగ్రవర్ణాల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ బాధితులు సోమవారం నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు డొంకాడకు చెందిన సుమారు 14 మంది అగ్రవర్ణాల వారిపై పలు సెక్షన్లతో కూడిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబులు మంగళవారం ఘటనా స్థలానికి, ఎస్సీ కాలనీకి వెళ్లి బాధితులను విచారించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన వారితోపాటు, దాడిలో గాయపడిన వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. విచారణను వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గ్రామంలో అగ్రవర్ణాల వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఒకసారి దాడి చేస్తే పెద్దల సమక్షంలో రాజీ పడ్డామన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే సెల్‌ఫోన్ చోరీ అభియోగం మోపి దాడికి తెగబడ్డారన్నారు. గ్రామపెద్దల సమక్షంలోనే దాడి జరిగిందని వాపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. బాధితులకు ధైర్యం చెప్పి మరోసారి బుధవారం విచారణకు వస్తామన్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలన్నారు.
న్యాయం జరగకపోతే ఉద్యమం ఉధృతం
గ్రామంలో డీఎస్పీ విచారణ అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బూర్తి ఏసయ్య, దళిత నాయకుడు రాజేష్, కూరపాటి అప్పారావు, మాజీ ఎంపీటీసీ విది కుమారి కన్నారావు, కుంచా రమణ, వీది సత్యనారాయణ, నొక్కి అప్పారావు, నాసా సంస్థ ప్రతినిధి శాంతికుమారి తదితరులు మాట్లాడుతూ పథకం ప్రకారం టీడీపీ నాయకులు దళితులపై దాడులకు తెగబడ్డారన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో సర్దిచెప్పేందుకు వచ్చిన మరికొంతమంది దళితులను గ్రామ పెద్దల సమక్షంలోనే దాడి చేసి గాయపరిచారన్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. 8 మంది దళిత యువకులపై దాడి చేసిన 14 మంది పేర్లతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేశామన్నారు. దాడి చేసిన వారిలో కొంతమంది పేర్లు ఎఫ్‌ఐఆర్ నుంచి తప్పించే ప్రయత్నాలు, కేసును నీరుగార్చే కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను కాపాడేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వచ్చిందని, అదే గనుక జరిగితే దళిత సంఘాలన్నీ ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాయని బూర్తి ఏసయ్య తెలిపారు.
దళితుల నుంచి వాంగ్మూలం నమోదు
కేసును నీరు గార్చే కుట్ర జరుగుతోందనిబాధితుల అనుమానం

డొంకాడ దాడిపై డీఎస్పీ విచారణ