
పరారీలో ఉన్న నిందితులను పట్టుకోండి
యలమంచిలి రూరల్ : వివిధ కేసుల్లో న్యాయస్థానాలు నాన్ బెయిలబుల్ వారెంట్‌లు జారీ చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితులను పట్టుకుని,న్యాయస్థానాల ఎదుట హాజరుపర్చాలని జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. శనివారం ఆయన యలమంచిలి సర్కిల్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి ఛార్జిషీట్‌లను దాఖలు చేయాలన్నారు. రౌడీషేటర్లు, నేరచరిత్ర, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపి ఉంచకుండా పర్యవేక్షించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, బాలికల రక్షణకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్‌ను ఎక్కువమంది ఉపయోగించేలా చైతన్యం తీసుకురావాలన్నారు. అంతకుముందు తనిఖీకి వచ్చిన ఎస్పీకి పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐలు సాదరస్వాగతం పలికారు. ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి రూరల్, యలమంచిలి పట్టణం, మునగపాక, యలమంచిలి ట్రాఫిక్ ఎస్‌ఐలు ఎం. ఉపేంద్ర, కె.సావిత్రి, ప్రసాద్, బి. రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ తుహిన్‌సిన్హా
యలమంచిలి సీఐ కార్యాలయం సందర్శన