
దేవరాపల్లి వైస్ ఎంపీపీ అభ్యర్థిగా సింహాచలంనాయుడు
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ అభ్యర్ధిగా వైఎస్సార్‌సీపీ తరుపున మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ఎంపిక చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులంతా శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా పంచాడ సింహాచలంనాయుడును వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి మాట్లాడుతూ 19న జరిగే వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని సింహాచలంనాయుడుకు మద్దతు పలికి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికై న పంచాడ సింహాచలంనాయుడును పలువురు అభినందించారు. కాగా గతంలో వైస్ ఎంపీపీ–1 పనిచేసిన చింతల బుల్లిలక్ష్మి ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల్లో ఎంపీపీగా గెలుపొందడంతో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో వైస్ ఎంపీపీ పదవికి ఈ నెల 19 ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపఽథ్యంలోనే మండల పరిషత్‌లో వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో వైఎస్సార్‌సీపీ తరపున పంచాడ సింహాచలంనాయుడు వైస్ ఎంపీపీగా గెలుపు అనివార్యం కానుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ–2 ఉర్రూకుల గంగాభవానీ, కోఆప్షన్ మెంబర్ దండే జాన్ విక్టర్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, మండల బిసి సెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనువాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విప్ జారీ
దేవరాపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికకు సంభందించి వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ–1 ఈ నెల 19న ఎన్నిక నిర్వహించనున్న నేపధ్యంలో తమ పార్టీ ఎంపీటీసీలకు వైఎస్సార్‌సీపీ తరపున ఆ పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు విప్ జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ తరుపున వైస్ ఎంపీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌సీపీ తరుపున బీ ఫారం పత్రాన్ని మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి,, జెడ్పీటీసీ కర్రి సత్యం శనివారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణికి శనివారం అందజేశారు.
ప్రకటించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి

దేవరాపల్లి వైస్ ఎంపీపీ అభ్యర్థిగా సింహాచలంనాయుడు