
పూరిల్లు.. పొదరిల్లు
● తాటాకు ఇంటిపై పెరుగుతున్న మక్కువ
● పల్లెకు వచ్చి సేద దీరుతున్న పట్నవాసులు
● ఫామ్ హౌస్ కల్చర్‌కు ఆదరణ
పక్షుల కువకువలు వినిపించకుండా పోతున్నాయి.. ఆలమందలు కనిపించకుండా పోతున్నాయి.. ప్రకృతి అందాలు కనుమరుగయ్యాయి.. సూర్యుడు కూడా కనిపించనంతటి ఎత్తైన భవనాలు.. ఆ ఇళ్లలో కృత్రిమ బంధాలతో బతుకంటేనే విసుగెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే మళ్లీ పాత రోజుల వైపు కొందరు వెనుదిరిగి చూస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఎన్.గజపతి నగరంలో ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు కట్టించుకున్న తాటాకు ఇల్లు
మాడుగుల: పట్టణాల్లోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉంటే ఎంత బాగుంటుంది! వాతావరణ కాలుష్యం సోకని ప్రపంచానికి దగ్గరయ్యే అదృష్టం దక్కితే ఎంత బాగుంటుంది! ఈ ఊహే ఇప్పుడు అందరినీ పల్లెటూరి వైపు నడిపిస్తోంది. తాతల కాలం నాటి పూరి గుడిసెలంటే కొందరు మక్కువ చూపిస్తున్నారు. పెంకుటిళ్లు, డాబాలు రావడంతో పల్లెల్లో కూడా పూరిళ్లు కనుమరుగయ్యాయి. తాటాకు కమ్మలతో నిర్మించిన ఇళ్లలో వేసవి కాలంలో చల్లదనం.. చలికాలంలో వెచ్చదనం ఉంటుంది. ఎటువంటి అనారోగ్యాలు దరి చేరేవి కావు. రైతులకు పండే దినుసులు దాచుకోవడానికి బాగుండేవి. అయితే అగ్ని ప్రమాదాలకు భయపడి గ్రామాల్లో కూడా డాబాలు నిర్మించుకున్నారు.
తాటి చెట్లు ఏవీ..
రైతు ఉన్న చోట తాటి చెట్టు ఉంటుందన్న సామెత ఇప్పుడు వినిపించకుండా పోయింది. తాటి చెట్లు లేవు, ఆ చెట్లు ఎక్కి తాటాకులు నరికే వారు కూడా కనుమరుగయ్యారు. అక్కడక్కడ మాత్రమే వీరు దర్శనమిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా పట్టణాలకు వెళ్లి నివాసముండడంతో అలాంటి వారు అరుదుగా కనిపిస్తున్నారు.
అంతరించిన ఊర పిచ్చుకలు
గ్రామీణ ప్రాంతాల్లో తాటాకు ఇళ్లు ఉండడం వలన తాటాకు పంచ పాలీల్లో ఊర పిచ్చుకలు అధికంగా ఉండేవి. ఇప్పుడు డాబా ఇళ్లు రావడంతో ఆ పిచ్చుకలు అంతరించిపోవడంతో పొలాల్లో చీడపురుగులు పెరిగిపోయి గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు తక్కువ ఖర్చుతో తాటాకు ఇల్లు నిర్మాణం జరిగేది. కానీ ప్రస్తుతం ప్రతి ఏటా తాటాకు నేతకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. తాటి చెట్లు చాలావరకు అంతరించిపోతుండడంతో ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్క తాటాకు 10 రూపాయల ధర పలుకుతోంది. పని దొరకక పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో తాటాకు నేసే వారు తక్కువయ్యారు.
ట్రెండ్ మారుతోంది..
రానురాను ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు కనిపిస్తోంది. కొంతమంది మళ్లీ తిరిగి వారి స్వగ్రామాలకు వచ్చి తాటాకు ఇల్లు నిర్మించుకుని వేసవి సెలవుల్లో సేద తీరుతున్నారు. ప్రస్తుతం ఈ తరహాలోనే ఫామ్‌హౌస్‌లు నిర్మితమవుతున్నాయి. దేవరాపల్లి మండలంలో ఎన్.గజపతినగరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చిరికి శ్రీనివాసరావు ఇప్పటికీ తాటాకు ఇంట్లోనే నివసిస్తున్నారు. మాడుగుల నియోజకవర్గంలో ఈ తరహా ఇళ్లు సుమారు 300 వరకు ఉన్నాయని అంచనా.
తాటాకు ఇల్లంటే ఇష్టం
నా చిన్నతనం నుంచి తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటున్నాను. ఎందుకో ఈ వాతావరణం అంటే నాకెంతో ఇష్టం. ఇలాంటి చోట్ల స్వచ్ఛత గోచరిస్తుంది. ఎంతో ఆరోగ్యకరం కూడా. పూరింటిలో వేసవిలో కూడా ఏసీ పెట్టనవసరం లేదు. చల్లగా ఉంటుంది. మేడ ఇల్లు కట్టుకోగలిగే స్థోమత ఉన్నా తాటాకు ఇంటిలోనే నివాసం ఉంటాను. ఇప్పుడు నాలాగే చాలామంది ఆలోచిస్తున్నారు.
–చిరికి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, ఎన్.గజపతినగరం
తాటాకు ఇంటికి డిమాండ్
గ్రామాల్లో తాటాకు ఇళ్లు ఉండేటప్పుడు ఊర పిచ్చుకలు ఉండేవి. ఇప్పుడు డాబాలు రావడంతో అవి అంతరించిపోయి నేడు జూలో చూడవలసిన పరిస్థితి దాపురించింది. ధాన్యం, అపరాలు బయట ఆరబోసినప్పుడు గింజల్లో పురుగులు లేకుండా ఏరుకునేవి. నేడు మందులు చల్లినా పురుగులు నశించటంలేదు. అందుకే డాబాలున్నా సరే పక్కన చిన్న తాటాకు ఇల్లు నిర్మించుకుంటున్నారు. –పొలమేర విజయలక్ష్మి, ఎంపీటీసీ, మాడుగుల

పూరిల్లు.. పొదరిల్లు

పూరిల్లు.. పొదరిల్లు

పూరిల్లు.. పొదరిల్లు