
మట్టి తిని బతకాలా ?
చీడికాడ: ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలు శుక్రవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని అర్జునగిరిలో ఉపాధి వేతనదారులు నోటిలో మట్టిని పెట్టుకుని... దానిని తింటున్నట్టు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న వీరికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉపాధి బకాయిలు చెల్లించలేదన్నారు. వేతనదారులు మట్టితిని బతకాలా అని ప్రశ్నించారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదన్నారు. కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపాధి వేతనదారుల వినూత్న నిరసన