
రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు
కశింకోట: మండలంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందానికి చెందిన సుమారు 20 మంది గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి విశాఖలోని వేపగుంట వెళుతున్న సింహాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు.. ముందు వెళుతున్న ప్రైవేటు బస్సును వెనుకగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సులోని సుమారు 20 మందికి స్వల్పగాయాలయ్యాయి. వారిలో కొంతమందిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అదే బస్సులో తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిపోయారు. వారి వివరాలు తెలియరాలేదు. వేపగుంటకు చెందిన యువతి వివాహం అన్నవరంలో జరగడంతో దానికి బంధు మిత్రులు ఆర్టీసీ బస్సును లీజుకు తీసుకొని వెళ్లి, తిరుగు ప్రయాణంలో విశాఖ వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో బస్సు ముందు అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం