
దళారుల చేతిలో దగా రైతన్నకు కూరగాయాలు
●
దేవరాపల్లి: సరకు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి.. బేరమాడే స్థాయిలో రైతులను నిలబెట్టాలి.. ఇది ప్రభుత్వం బాధ్యత. అధికారుల కర్తవ్యం. కానీ దళారీలు నిర్భయంగా దోపిడీ చేస్తున్నారు. కష్టపడి సాగు చేసిన రైతును దోచుకుంటున్నారు. అయినా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో అతి పెద్దదైన దేవరాపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు జిల్లా నలుమూలల నుంచే కాక విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల నుంచి వచ్చి సరకు కొనుగోలు చేస్తారు. మార్కెట్‌కు రోజూ సుమారు 10 టన్నుల కూరగాయలు వస్తాయి. రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి హోల్‌సేల్ మార్కెట్‌కు దేవరాపల్లి, వేపాడ, అనంతగిరి మండలాల పరిధిలో 3 వేల ఎకరాల్లో పండించిన కాయగూరలను తీసుకువచ్చి విక్రయిస్తారు. టమాటా, బీర, బెండ, వంగ, ఆనప, కాకర, చిక్కుడు, బరబాటి, దోసకాయలతోపాటు తోటకూర, పాల కూర, గోంగూర, కొత్తిమీర తదితర ఆకుకూరలను ఇక్కడ పండిస్తారు.
అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే..
స్థానిక కాయగూరల మార్కెట్‌పై ఇటు మార్కెట్ కమిటీ అధికారులు, అటు పంచాయతీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ద్వారా ఆదాయం పొందుతున్న పంచాయతీ అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. నిలువ నీడ లేకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడి రైతులకు రైతుబజారు కార్డులు మంజూరు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.
దేవరాపల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో దళారీల దోపిడీ
సిండికేట్‌గా ఏర్పడి మద్దతు ధర లేకుండా చేస్తున్న వైనం
కనీస మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ఆవేదనతో రోడ్లపైన కాయగూరలు పారబోస్తున్న దైన్యం
దిగుబడి బాగున్నా..
సుమారు ఎకరం విస్తీర్ణంలో వంగ, బీర, ఆనప, దోస కాయలు సాగు చేశాను. దుక్కులు, ఎరువులు, పురుగుల మందులు తదితర పనులకు సుమారు రూ.22 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. దిగుబడి కూడా బాగానే ఉంది. కాని దేవరాపల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో మద్దతు ధర ఉండటం లేదు. కనీసం కూలి డబ్బులు కూడా రాలేదు.
– కొల్లి రమణ, కూరగాయల రైతు,
దేవరాపల్లి
కనీస ధర దక్కడం లేదు
అరవై సెంట్లలో సుమారు రూ.16 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కాయ గూరల దిగుబడి బాగానే ఉంది. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు లేకుండా చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్‌లో కాయగూర ధరలు బాగానే ఉన్నప్పటికీ దేవరాపల్లి మార్కెట్లో కష్టపడి పండించిన రైతుకు కనీస ధర దక్కడం లేదు.
– అల్లు రాము, కూరగాయల రైతు, దేవరాపల్లి

దళారుల చేతిలో దగా రైతన్నకు కూరగాయాలు

దళారుల చేతిలో దగా రైతన్నకు కూరగాయాలు