
అరెస్టులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
సాక్షి, అనకాపల్లి: విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. వీరిద్దరి అరెస్ట్‌లను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శుక్రవారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ.. ప్రతి అంశంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఎక్కడా ఏ ఆధారాలు లేకపోయినా, లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అందులో అందరి పేర్లు చేరుస్తూ, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తూ, తప్పుడు వాంగ్మూలాలతో కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అనైతిక పని, మొత్తం వ్యవస్థలపైనే ప్రభావం చూపుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్నారు. ఈ అరెస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేస్తుందని, తమకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్