
రూ.8.3 లక్షలు ఏ మూలకూ చాలవు
నక్కపల్లి: పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రకటించిన రూ.8.30 లక్షలు ఏమూలకూ సరిపోవని, ప్యాకేజీ పెంచాల్సిందేనంటూ పలువురు అఖిలపక్ష నాయకులు, నిర్వాసితులు డిమాండ్ చేశారు. గురువారం చందనాడలో నిర్వాసితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరపున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం తరపున జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, నిర్వాసితుల తరపున గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వీసం రామకృష్ణ, అప్పలరాజులు మాట్లాడుతూ పరిశ్రమల కోసం ఏపీఐఐసీకి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం పూర్తి న్యాయం చేయలేదన్నారు. డీఫారం రైతులకు కేవలం భూములకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి ఫలసాయానికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఇక సాగుదార్లకు ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. నివాస ప్రాంతాలు, పశువుల షెడ్లు కోల్పోయిన వారికి నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఇవ్వాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అరకొరగా ప్రకటించారన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచాలి
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ఎనిమిది లక్షలు పునాదులు తీయడానికి కూడా సరిపోవన్నారు. రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలన్నారు. ప్యాకేజీ విషయంలో న్యాయం జరగకపోతే నిర్వాసితుల తరపున ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఎన్నికల ముందు నిర్వాసితుల తరపున ఆందోళనలు చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారని విమర్శించారు. 2014లో టీడీపీ నాయకుల మాటలు నమ్మి రైతులు కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకుని ఏపీఐఐసీకి భూములు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. చందనాడ, డీఎల్‌పురం, అమలాపురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన నిర్వాసితులు, రైతులు పాల్గొన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే
ఏపీఐఐసీ నిర్వాసితుల డిమాండ్
చందనాడలో అఖిలపక్ష సమావేశం

రూ.8.3 లక్షలు ఏ మూలకూ చాలవు