
ఎస్పీ తుహిన్ సిన్హా
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
మాకవరపాలెం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, నేర నియంత్రణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ర్యాగింగ్, మహిళలపై జరుగుతున్న వేధింపులు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళా చట్టాలపైన, శక్తి యాప్‌పైన విసృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, వీటిపై ప్రజలకు వివరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసిన ఎస్పీ సిబ్బందితో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు.