చోడవరం టీడీపీలో వర్గ పోరు | - | Sakshi
Sakshi News home page

చోడవరం టీడీపీలో వర్గ పోరు

May 15 2025 12:45 AM | Updated on May 15 2025 12:59 AM

చోడవర

చోడవరం టీడీపీలో వర్గ పోరు

● ఎమ్మెల్యే రాజు తీరుపై తాతయ్యబాబు, మల్లునాయుడు గుర్రు ● అసమ్మతి నాయకులకు ఎంపీ సీఎం రమేష్‌ ప్రోత్సాహం!

చోడవరం: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుల మధ్య ఆధిపత్య వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రూరల్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే జరుగుతోంది. ఎమ్మెల్యే రాజుకి అత్యంత సన్నిహితుడు, క్లాస్‌మేట్‌ అయిన గోవాడ సుగర్స్‌ మాజీ చైర్మన్‌, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు కూడా ఎమ్మెల్యే తీరుపై లోలోపల అసమ్మతితో ఉన్నారు. వాస్తవానికి వీరు ముగ్గురూ గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం రాజుకే టిక్కెట్టు ఇవ్వడంతో తాతయ్యబాబు, మల్లునాయుడు అసమ్మతితోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాతయ్యబాబు నేరుగా మంత్రి లోకేష్‌తో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ కోటరీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌గా కూడా పదవి దక్కింది. ఈ పరిణామం ఎమ్మెల్యే రాజుకి రుచించలేదు. అధిష్టానం నేరుగా తాతయ్యబాబుకు పదవులు ఇవ్వడంతో ఎమ్మెల్యే అంటీఅంటనట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన తాతయ్యబాబు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ చాపకింద నీరులా తన వర్గం మరింత బలపడేలా పావులు కదుపుతున్నారు. దీనిని ఏమాత్రం సహించలేకపోతున్న ఎమ్మెల్యే రాజు చెక్‌పెట్టేందుకు తాతయ్యబాబు సొంత మండలమైన బుచ్చెయ్యపేటలోనే వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తాతయ్యబాబుకు సమాచారం లేకుండానే గేదెల సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొంటుండడంతో తాతయ్యబాబు వర్గానికి ఏమాత్రం నచ్చడం లేదు.

వడ్డాదిలో బయటపడ్డ విభేదాలు

ఇటీవల వడ్డాదిలో పార్టీ సమాశానికి జిల్లా అధ్యక్షుడైన తాతయ్యబాబు ఫొటో లేకుండానే ఫ్లెక్సీ వేయించడంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ విషయం లోకేష్‌, చంద్రబాబు వరకూ కూడా తాతయ్యబాబు తీసుకెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఈ గొడవ జరిగిన ఈ నెలరోజుల్లో పార్టీ అధిష్టానం ఏమి చెప్పిందో గానీ తాతయ్యబాబు తన వర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయనే ముఖ్య అతిథిగా వెళ్లిపోతుండడంపై ఎమ్మెల్యే మరింత గుర్రుగా ఉన్నారు. బుచ్చెయ్యపేటతో పాటు చోడవరం, రావికమతం, రోలుగుంట మండలాల్లో కూడా వీరిద్దరి వర్గాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. ఈ పరిణామం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అయోమయాన్ని నింపింది. మరో పక్క మల్లునాయుడు కూడా తన వెలమ సామాజిక వర్గంతో పాటు పార్టీలో తన అనుచరుల వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజుకి చోడవరం పట్టణం వరకూ మల్లునాయుడు కుడి భుజంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటూనే రెండుసార్లు తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు రాకుండా అడ్డుపడి తన స్వలాభం కోసం రాజు చేస్తున్న రాజకీయ చతురతకు ఈసారి చెక్‌ పెట్టాలని మల్లునాయుడు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కూడా బయటకు ఎమ్మెల్యేతో తిరుగుతూ లోలోపల ఎంపీ రమేష్‌, తాతయ్యబాబులతో సఖ్యతగా ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టారు. ఇటీవల పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వెళ్లడం, చోడవరం పట్టణంలో మరిడిమాంబ పండగను ఎంతో ప్రతిష్టాత్మకంగా మల్లునాయుడే తన భుజాలపైనే వేసుకొని చేసినప్పటికీ ఈ రెండు కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాకుండా డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇంకా నాలుగేళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికార టీడీపీ ప్రధాన నాయకులు మధ్య ఆధిపత్య , వర్గ విభేదాలు మరింత బహిర్గతం కావడంతో తటస్థంగా ఉన్న పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి ఎంపీ సీఎం రమేష్‌ లోపాయికారిగా ప్రోత్సాహం అందిస్తున్నారంటూ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ వర్గ విభేదాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చోడవరం టీడీపీలో వర్గ పోరు 1
1/2

చోడవరం టీడీపీలో వర్గ పోరు

చోడవరం టీడీపీలో వర్గ పోరు 2
2/2

చోడవరం టీడీపీలో వర్గ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement