రెవెన్యూ సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలే అధికం

May 13 2025 12:59 AM | Updated on May 13 2025 12:59 AM

రెవెన

రెవెన్యూ సమస్యలే అధికం

● పీజీఆర్‌ఎస్‌లో పరిష్కారం కాని అర్జీలు ● అర్జీని ఎండార్స్‌మెంట్‌తో ముగిస్తున్న అధికారులు

భూ పంపకాల్లో వివాదం

గతంలో కుమారుడితో పాటు కుమార్తెలకు సమానంగా పంచి మూడు భాగాలుగా ఏర్పాటు చేసుకుని సాగుతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురి పేరున నమోదు చేయించుకున్న పంపకాలను కాదని కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడని చోడవరం మండలం పీఎస్‌ పేట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బండారు దేముడమ్మ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు తెలిపింది. నడవలేని ఆమె కుమార్తె సహాయంతో ఆటోలో కలెక్టరేట్‌కు చేరుకుని తనకు భర్తమూలంగా, స్వార్జితంగాను వచ్చిన భూమి వివరాలతో పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేసింది. ఆర్‌వోఆర్‌ కేసులు, ఎంఎల్‌సీసీ మీటింగ్‌లకు కూడా తాము హాజరవుతున్నామని, అయినా పరిష్కారం దొరకడం లేదని ఆమె కుమార్తె బోకం పైడితల్లమ్మ తెలిపింది.

తుమ్మపాల: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రోజురోజుకు ప్రజల మన్ననలు కోల్పోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు పీజీఆర్‌ఎస్‌ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అధికారులు, పాలకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు చేసుకున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారి ధ్రువీకరణతో సమస్యపై ఎండార్స్‌మెంట్‌ మాత్రం ఇస్తున్నారని తెలిపారు. సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో కలెక్టరేట్‌ వద్ద నిరసనల సంఖ్య తగ్గింది. పీజీఆర్‌ఎస్‌ వేదిక నుంచి ఇంచార్జి కలెక్టర్‌ ఎం.జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి–170, పంచాయతీ రాజ్‌ –25, పోలీస్‌–13, ఇతర శాఖల్లోను ఫిర్యాదులు నమోదయ్యాయి.

బార్క్‌ నిర్వాసితుల నిరసన

బార్క్‌ నిర్వాసితుల జాబితాలో కక్షపూరితంగా తమ పేర్లు తొలగించారంటూ అచ్చుతాపురం మండలం తంతడి శివారు యాతపాలేనికి చెందిన 30 మందికి పైగా నిర్వాసితులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేశారు. బార్క్‌ ఎక్స్‌టెన్సన్‌లో ఇల్లు కోల్పోయిన తమకు 2005 ఏడాదిలో నష్టపరిహారం మంజూరు చేసారని, తదుపరి ప్రభుత్వం చేపట్టిన రెండు సర్వేల్లో నిర్వాసితుల జాబితాలో తమ పేర్లు కొనసాగాయని, ఇటీవల చేపట్టిన సర్వేలో తమ పేర్లను తొలగించి ఈ నెల 8న సచివాలయంలో జాబితా ప్రదర్శించారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

కేబుల్‌ ఆపరేటర్‌ సంఘాల నిరసన

ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ పథకంపై సీఎం చంద్రబాబు కేబుల్‌ ఆపరేటర్‌ సంఘాల నేతలతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ), ఫైబర్‌ నెట్‌ ఆపరేటర్స్‌ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఓఎఫ్‌), మల్టీ సర్వీసెస్‌ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్‌, మల్టీ సర్వీసెస్‌ జిల్లా అధ్యక్షుడు కొణతాల ప్రకాష్‌, ఎఫ్‌ఓఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్న ఫైబర్‌ నెట్‌ పథకం రానురాను దిగజారి పోతుందని, 2017లో పారంభించి ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ, ల్యాండ్‌ ఫోన్‌ను నాణ్యతతో కూడిన సేవలు తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో కొనసాగుతున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఏపి ఫైబర్‌లో ఉన్నఫలంగా వందలాది మంది సిబ్బందిని తొలగించడంతో సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెటాప్‌ బాక్స్‌లపై రూ. 59 రెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో ఇంచార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

మత్స్యాకార భరోసా అందలేదు

అచ్యుతాపురం రూరల్‌: అర్హులైన మత్స్యకారులకు మ త్స్యకార భరోసా అందలేదని మండల వైస్‌ ఎంపీపీ వాసుపల్లి పద్మావతి శ్రీనివాస్‌ అన్నారు. అర్హులైన మ త్స్యకారులకు వేట నిషేధ భృతి అందేలా న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. బోటుకు ఇద్దరు చొప్పున మత్స్యకార భరో సా అర్హులకు అందనీయకుండా పక్కదోవ పట్టించారని, సుమారు 200 మంది అర్హులైన మత్స్యకారులకు వే ట నిషేధ భృతి అందలేదని తెలిపారు. అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు.

చెరకు రైతుకు రవాణా చార్జీలు చెల్లించాలి

బుచ్చెయ్యపేట: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన వారికి రవాణా ఖర్చులు, వెయిటింగ్‌ చార్జీలు అందించాలని బుచ్చెయ్యపేటకు చెందిన పలువురు చెరకు రైతులు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ క్రషింగ్‌కు చెరకు కాటాల నుంచి లారీల ద్వారా చెరకును తరలించాల్సిన కాంట్రాక్టర్‌ చెరకును పూర్తిగా తరలించకుండా మధ్యలోనే ఆపేయడంతో రైతులే సొంత ఖర్చుతో తరలించారని, ఫ్యాక్టరీ మరమ్మతులతో క్రషింగ్‌ నిలిచిపోవడంతో ఫ్యాక్టరీ అధికారులు రవాణా ఖర్చులతో పాటు వెయిటింగ్‌ ఛార్జీలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్‌కు రవాణా ఛార్జీలు చెల్లించిన అధికారులు రైతులకు మాత్రం ఇవ్వలేదని రైతులు గోపిశెట్టి శ్రీను, గాడి శ్రీను, రమణబాబు,ఐయితరెడ్డి రమణ తదితరులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు వినతి పత్రం అందించారు.

రెవెన్యూ సమస్యలే అధికం 1
1/3

రెవెన్యూ సమస్యలే అధికం

రెవెన్యూ సమస్యలే అధికం 2
2/3

రెవెన్యూ సమస్యలే అధికం

రెవెన్యూ సమస్యలే అధికం 3
3/3

రెవెన్యూ సమస్యలే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement